Friday, 12 April 2013

వైఎస్సార్‌సీపీ ప్రభంజనం





వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
               
* 230 సీట్లు ఖాయం
*
విజయమ్మ పేరులోనే విజయం ఉంది
*
జగన్ త్వరలో బయటకు వస్తారు
*
మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం
*
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
*
గందరగోళం తర్వాతే స్థిరత్వం వస్తుంది
*
కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం ఉండవు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ప్రభంజనం సృష్టించబోతోందని, వచ్చే ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తుందని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి చెప్పారు. విజయ నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజలు, పంచాంగ శ్రవణం చేశారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ పార్టీ అనుగ్రహం లేకుండా ఏ వ్యక్తీ ప్రధానమంత్రి కాలేరని చెప్పారు. గ్రహ గతుల ఆధారంగా తాను ఈ అంశాలు చెబుతున్నానన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కనుక గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రానికి ఉపకారాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం కలిసి ఉండలేవని ఏదో ఒక రోజు విడిపోతాయని ఆ తరుణం కోసం ఎదురు చూడాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పై పోటీ చేయడం ఆత్మహత్యా సదృశ్యంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారని, మహా ప్రభంజనం ముందు ప్రాణాలు ఒడ్డడం ఎందుకని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జాతక రీత్యా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని, ఆయన త్వరలో బయటకు వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళతారన్నారు.


రాష్ట్రంలో సూర్యచంద్రులు కలిశారా?

కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చి తీరతాయి. రకరకాల కూటములు, కొత్త ఫ్రంట్‌లు ఏర్పడే అవకాశం ఉంది. భాగస్వామ్య పార్టీలతో విభేదించి కూటములు మారుతుంటారు. ప్రజల పక్షాన ఉన్న వారినే విజయం వరిస్తుంది. రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది పలు కష్టనష్టాలకు గురైనా అంతిమంగా సుఖశాంతులు పొందుతారు. ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రానికి కొత్తేమీ కాదు.. అయితే రాష్ట్రానికి ఇబ్బందులు అంతగా ఉండవు. గ్రహ గతుల ప్రకారం సూర్యచంద్రులు కలిస్తే అమావాస్య(చీకటి) వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి సూర్యచంద్రులు కలిసి పోయారా? అన్నట్లుగా ఉంది. సూర్యచంద్రులు సమదూరంలో ఉంటే పౌర్ణమి వస్తుంది. అది అందరికీ ఆహ్లాదకరమైనది. ప్రజలంతా సాధారణ ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అమావాస్యను ఎంత కాలం భరించాలి? పౌర్ణమి రావాలని కోరుకుంటున్నారు.

ప్రజలు చల్లగా ఉండాలి: విజయమ్మ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉగాది పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. తాము ఎపుడైనా ఇల్లు మారాల్సి వచ్చినపుడు ఉగాది పండుగ తరువాత వచ్చే శుభప్రదమైన రోజున మారదామని వైఎస్ చెప్పేవారన్నారు. విజయనామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరిగి చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సూర్యచంద్రులు కలిసి పోయినట్లుగా ఉన్నారని... కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న చీకటి పాలన మాదిరిగా పరిస్థితి ఉందన్నారు. విజయమ్మ తొలుత జ్యోతి వెలిగించి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా విజయమ్మ ప్రజల కోసం తపన పడటాన్ని ఆమెకు దగ్గరగా ఉండే తమలాంటి వారు చూసి ఆవేదన చెందుతుంటామని కానీ ఆమె మాత్రం నిబ్బరంగా ఉంటారని శోభ అన్నారు. జగన్ బయట ఉంటే ఉగాది ఇంకా ఆనందోత్సాహాలతో జరుపుకునే వాళ్లమన్నారు. తాను జగన్‌ను కలిసినప్పుడల్లా ప్రజల కోసం పోరాటాలు చేయాలని చెబుతున్నారని తెలిపారు. తొలుత విజయమ్మ జ్యోతి వెలిగించి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు.
పూలేకు నివాళులు...
మహాత్మా జ్యోతిరావ్ పూలే 186వ జయంతి సందర్భంగా విజయమ్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మహాత్మా అని పేరు గాంచిన వారు ఇద్దరేనని, వారిలో ఒకరు గాంధీ మహాత్ములైతే, మరొకరు పూలే అని అన్నారు. గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడితే, పూలే సామాజిక స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అన్నారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన పూలే మహిళా విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన సతీమణి తొలి మహిళా ఉపాధ్యాయిని కావడం విశేషమన్నారు. వైఎస్ 2009 ఏప్రిల్ 11న తొలిసారిగా పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నల్లా సూర్యప్రకాష్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఏ.సోమయాజులు, సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్, అధికార ప్రతినిధి ఆర్.కె.రోజా, బి.జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోన రఘుపతి, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

నూతన ఏడాది పేరు విజయనామ సంవత్సరం. వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలి పేరులోనే విజయం ఉంది. ఆమె నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. కార్యకర్తలు చేయాల్సిందల్లా ఇతోధికంగా ఆమెకు మద్దతు ప్రకటించడమే. అందరినీ కలుపుకొని పోయే ఉదారగుణం విజయమ్మ, జగన్, షర్మిలకు ఉంది. అందుకే గుడివాడ, బెజవాడలలో పాదయాత్ర సభలకు జనం పోటెత్తుతున్నారు. షర్మిల పాదయాత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది.
- మారేపల్లి రామచంద్రశాస్త్రి, ప్రముఖ సిద్ధాంతి

Wednesday, 10 April 2013

రాష్ట్రమంతా బంద్..




 బంద్..బంద్..బంద్........


 రాష్ట్రమంతా బంద్..
              
లెఫ్ట్, వైఎస్సార్ సీపీ ప్రదర్శనలు, ర్యాలీలు, ఆందోళనలు
తెల్లవారుజామునే లెఫ్ట్ నేతల అరెస్టు
కార్యాచరణపై 11న వామపక్షాల భేటీ
చార్జీలు తగ్గించేదాకా పోరేనని ప్రకటన
సచివాలయ ముట్టడికి బీజేపీ యత్నం
విద్యుత్ చార్జీల పెంపు, కరెంటు కోతలకు నిరసనగా ప్రతిపక్షాలు మంగళవారం నిర్వహించిన రాష్ట్ర బంద్ స్వల్ప సంఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెసేతర పక్షాలన్నీ బంద్‌లో పాల్గొన్నాయి. వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాల నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పలు జిల్లాలలో బస్సులు డిపోల నుంచి కదల్లేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు బ్యాంకు, బీమా రంగాల ఉద్యోగులు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు,పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.
మంగళవారం జరగాల్సిన కొన్ని పరీక్షలు వాయిదా పడగా మరికొన్ని యథావిధిగా జరిగాయి. భక్తులతో కిటకిటలాడే తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు వెలవెలబోయాయి. ఆంక్షలను ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వద్ద తెల్లవారుజామునే బైఠాయించిన వామపక్ష నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిమిత సంఖ్యలో సిటీ బస్సులు తిరిగాయి. కొన్ని ఆటో యూనియన్లు బంద్‌కు మద్దతు పలకడంతో రోడ్లపై వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. వైఎస్సార్‌సీపీ నేతలు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి దుకాణాలను మూయించారు.

చార్జీలను తగ్గించేదాకా విద్యుత్ ఉద్యమం ఆగదని వామపక్షాలు, వైఎస్సార్‌సీపీ హెచ్చరించాయి. ఈనెల 11న హైదరాబాద్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వామపక్షాలు పేర్కొన్నాయి. పారిశ్రామికవేత్తలు పలుచోట్ల విద్యుత్ సబ్‌స్టేషన్లను ముట్టడించి నిరసన తెలిపారు. వ్యాపార వర్గాలు తమ దుకాణాల ఎదుట స్వచ్ఛందంగా బ్యానర్లు కట్టి ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయాన్ని తెలుగు మహిళా రాష్ట్ర విభాగం నేతలు మంగళవారం శోభాహైమావతి ఆధ్వర్యంలో ముట్టడించారు. బంద్‌కు సహకరించిన రాష్ట్ర ప్రజానీకానికి వామపక్షాలు, వైఎస్సార్‌సీపీ కృతజ్ఞతలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఇది న్యాయమైన బంద్ అని నిరూపితమైందన్నాయి.

బంద్ ప్రభావం చూసైనా...: లెఫ్ట్
లెఫ్ట్ కార్యకర్తలు తెల్లవారుజామునే రోడ్ల మీదకు చేరారు. బస్సుల్ని అటకాయించారు. డిపోల ఎదుట రాస్తారోకోలు చేశారు. ఎంజీబీఎస్ వద్ద తెల్లవారుజామునే బైఠాయించిన బీవీ రాఘవులు, వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), కె.నారాయణ, కె.రామకృష్ణ (సీపీఐ), గాదె దివాకర్ (న్యూ డెమోక్రసీ) తదితర వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తా వద్ద, సీపీఎం కార్యకర్తలు చిక్కడపల్లి క్రాస్‌రోడ్స్‌లో, న్యూ డెమోక్రసీ నేతృత్వంలో రాంనగర్ చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. బంద్ ప్రభావాన్ని చూసైనా చార్జీలు తగ్గించాలని రాఘవులు, మర్చంట్స్ పవర్ పాలసీని రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కోను బలపరచాలని నారాయణ డిమాండ్ చేశారు. మొండితనంతో కాకుండా వివేచనతో వ్యవహరించాలని నేతలు సలహా ఇచ్చారు.

బీజేపీ నేతల అరెస్టు
బీజేపీ రాష్ట్ర శాఖ తలపెట్టిన ధర్నా, చలో సచివాలయం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన నేతలు, కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఆ వెంటనే సచివాలయ ముట్టడికి బయలుదేరిన మరో బృందాన్ని దారిలోనే అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, మురళీధర్‌రావు, సీహెచ్ విద్యాసాగరరావు, కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, జి.కిషన్‌రెడ్డి తదితరులు అరెస్టయ్యారు.

కోస్తా, సీమల్లో విజయవంతం

అనంతపురంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానంపాదయాత్ర మొదలు పెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి బంద్‌లో పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. టీడీపీ నాయకులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి ఆర్టీసీ బస్టాండు వద్ద ధర్నా చేపట్టారు. విజయవాడలో బస్టాండ్ నుంచి ఒక్క బస్సును కూడా బయటకు రానీయకుండా విపక్షాల నేతలు అడ్డుకున్నారు. గుంటూరు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనలకు నేతృత్వం వహించారు.

తెలంగాణలో ఉద్రిక్తంగా...

కరీంనగర్‌లో లెఫ్ట్ నేతలు, కార్యకర్తలు బస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో మోటారుసైకిల్ ర్యాలీలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్‌లో న్యాయవాదులు నిర్వహించిన నిరసనలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను చెట్టుకు ఉరి తీసి నిరసన తెలిపారు. హన్మకొండలో ఏషియన్ మాల్‌ను మూసివేతకు యత్నించిన టీఆర్‌ఎస్ శ్రేణులను యాజమాన్యం అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ ఎమ్మెల్యే వినయభాస్కర్ సహా 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.